పెళ్లికి ఇంకా టైముందంటోన్న సీనియర్ హీరోయిన్లు!

04-09-2017 Mon 11:35
వెండితెరపై తమ హవాను కొనసాగిస్తోన్న కథానాయికలకు "పెళ్లెప్పుడు"? అనే ప్రశ్న ఎదురవ్వడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇటీవలే ఈ ప్రశ్నను శ్రియను అడిగితే అందుకు ఇంకా చాలా టైముందంటూ ఒక్క ముక్కలో చెప్పేసి వెళ్లిపోయింది. ఇక కాజల్ .. తాప్సీ పరిస్థితి కూడా అలాగే వుంది. తమకి నచ్చినవాడు ఇంకా తారసపడలేదనీ, ప్రస్తుతం తమ దృష్టంతా కెరియర్ పైనే ఉందని చెప్పేశారు.

 ఇక ప్రస్తుతం పెళ్లి గురించిన ఆలోచన లేదనేది తమన్నా సమాధానం. నిశ్చితార్థం జరిగిన తరువాత ఆ సంబంధాన్ని పక్కన పెట్టేసిన త్రిష కూడా, ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ప్రచారంలోనే ఉంటాయి కనుక, ఆమెను అడిగేంత అవకాశం ఉండదు. ఇక నయనతార విషయానికే వస్తే, ఆమె పెళ్లి గురించి అడిగే అవకాశమే ఇవ్వదు.