: చెఫ్ లుగా మారనున్న కోల్ కతా రెడ్ లైట్ ఏరియా సెక్స్ వర్కర్లు!

ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కోల్ కతాలోని సోనాగచ్చి. ఇక్కడి సెక్స్ వర్కర్లు త్వరలో చెఫ్ లుగా మారనున్నారు. దసరా పండగ నేపథ్యంలో కోల్ కతాలో దుర్గా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయతి. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్లు చెఫ్ లుగా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని ఫిషరీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. ఈ సందర్భంగా సౌమ్యజిత్ మాట్లాడుతూ, సెక్స్ వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుపై తమతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.

ఈ మేరకు సెక్స్ వర్కర్లను చెఫ్ లుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. డీఎంఎస్సీలో రిజిస్టర్ అయిన సెక్స్ వర్కర్ల సంఖ్య 1.3 లక్షల మంది. దుర్గా పూజల సమయంలో కోల్ కతాలోని ఎనిమిది ప్రాంతాల్లో, బెంగళూరులోని రెండు చోట్ల ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ అధికారులు తెలిపారు. తమకు చెఫ్ ల అవసరం ఉందని, డీఎంఎస్సీని సంప్రదించగా అందుకు వారు అంగీకరించారని చెప్పారు. చేపలను ప్యాక్ చేయడంలో, వాటి వంటకాల్లో ఈ సెక్స్ వర్కర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. 

More Telugu News