: మంత్రివర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి.. ఒక్కరికీ పదవి దక్కలేదు!

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. 9 కొత్త ముఖాలకు స్థానం కల్పించినప్పటికీ తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ స్థానం కల్పించకపోవడం గమనార్హం. మంత్రి పదవి ఊహాగానాల నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు నిరాశ ఎదురైంది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో వెదిరె శ్రీరామ్‌ లేదా మురళీధర్‌ రావును తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. అయితే వారికి కూడా మొండిచెయ్యే ఎదురైంది.

మొన్నటి వరకు కేంద్ర కేబినెట్‌ మినిస్టర్ గా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమోట్ కావడం.. కేంద్ర మంత్రి పదవి నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలకడంతో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు మంత్రి పదవులను త్యాగం చేశాయి. వీరి స్థానంలో ఒక్కరికైనా స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే అందరి ఆశలు అడియాసలు చేస్తూ ఎవరికీ పదవులు దక్కలేదు. దీంతో కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏపీ నుంచి తెలుగు దేశం తరఫున అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉండగా, తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఏపీతో సంబంధం ఉన్న నిర్మలా సీతారామన్‌ కు కేబినెట్‌ హోదా ప్రమోషన్‌ కల్పించిన సంగతి తెలిసిందే.  

More Telugu News