: హ‌రికేన్ హార్వీ బాధితుల‌కు కార్పోరేట్ కంపెనీల సాయం... ఇప్ప‌టివ‌ర‌కు 170 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు

టెక్సాస్ రాష్ట్రాన్ని కుదిపేసిన హ‌రికేన్ హార్వీ విప‌త్తు అనంత‌ర స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం అమెరికా కార్పోరేట్ దిగ్గ‌జాలు త‌మ‌వంతు సాయాన్ని అంద‌జేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వివిధ కంపెనీలు చేసిన సాయం విలువ 170 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు చేరుకుంద‌ని అమెరికా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వెల్ల‌డించింది. 52కి పైగా కంపెనీలు ఒక్కొక్కటి మిలియ‌న్ డాల‌ర్లకు పైగా స‌హాయం చేసిన‌ట్లు పేర్కొంది.

 హ్యూస్ట‌న్ ప్రాంతానికి చెందిన టెక్ దిగ్గ‌జం మైకేల్ డెల్ 36 మిలియ‌న్ డాల‌ర్లు స‌హాయనిధికి ప్ర‌క‌టించారు. వాల్‌మార్ట్ 20 మిలియ‌న్ డాల‌ర్లు, వెరిజాన్ 10 మిలియ‌న్ డాలర్లు స‌హాయం ప్ర‌క‌టించాయ‌ని ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తెలిపింది. అలాగే ఫెడ్ఎక్స్‌, యూపీఎస్ లాంటి కొరియ‌ర్ స‌ర్వీస్ కంపెనీ 1 మిలియ‌న్ డాల‌ర్ల స‌హాయంతో పాటు వారి కొరియ‌ర్ స‌ర్వీసుల‌ను, నెట్‌వ‌ర్క్‌ను ఉచితంగా ఉప‌యోగించుకునే సదుపాయం క‌ల్పించాయి.

శాంసంగ్ కూడా వాషింగ్ మెషీన్‌, డ్రైయ్య‌ర్లు, ఇంకా ఇత‌ర గృహోప‌క‌ర‌ణాల‌ను వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో పంచిపెట్ట‌మ‌ని ఓ ఎన్జీవోను పుర‌మాయించింది. జేపీ మోర్గాన్ లాంటి క్రెడిట్ కంపెనీలు డ‌బ్బు స‌హాయంతో పాటు టెక్సాస్‌లో ఉన్న త‌మ వినియోగ‌దారుల‌కు క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గ‌డువును పెంచాయి. అలాగే టెక్సాస్‌కు చెందిన ఎయిర్‌లైన్ కంపెనీలు బాధిత ప్రాంతాల‌కు విచ్చేసే ఎన్జీవో ప్ర‌తినిధుల‌కు, వాలంటీర్లకు ఉచితంగా ప్ర‌యాణ స‌దుపాయాన్ని క‌ల్పించాయి.

More Telugu News