: గుర్మీత్ బాబా ఆశ్రమం నుంచి ఓ అమ్మాయి అదృశ్యం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న

అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ బాబా జైలులో శిక్ష అనుభ‌విస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, సీబీఐ కోర్టు ఆయ‌న‌కు శిక్ష ఖ‌రారు చేసిన‌ రోజు నుంచి శ్ర‌ద్ధ అనే అమ్మాయి క‌న‌ప‌డ‌కుండా పోయింది. ఆమె హర్యానాలోని సిర్సాలోని గుర్మీత్ బాబా ఆశ్ర‌మంలో 2008 నుంచి ఉంటోంది. అదే రాష్ట్రానికి చెందిన శ్ర‌ద్ధా త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని తెలుసుకొని ఆందోళ‌న చెందుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోమ‌ని తాము త‌మ కూతురిని 2008లో సిర్సాలోని డేరా బాబా ఆశ్ర‌మంలో చేర్పించామ‌ని, ఆమెను అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తాము స్వ‌యంగా క‌లుసుకోలేద‌ని చెప్పారు.

ఓ సారి మాత్రం డేరాకు చెందిన ఓ మ్యాగ‌జైన్‌లో త‌మ అమ్మాయి ఫొటో చూసుకున్నామ‌ని, యోగా సాధ‌కురాలిగా ఆమె అక్క‌డ‌ సేవ‌లందిస్తోంద‌ని తెలుసుకున్నామ‌ని తెలిపారు. తాము త‌మ కూతురిని ప‌లుసార్లు క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించామ‌ని, అయితే, ఆశ్ర‌మ అధికారులు అందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ఆశ్ర‌మ అధికారులకు తాము కొన్ని రోజులుగా ఫోన్ చేస్తున్నామ‌ని, ఇప్పుడు కూడా ఆశ్ర‌మంలోకి రావ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ఆశ్ర‌మ ప‌రిసరాల్లో క‌ర్ఫ్యూ ఉన్న కార‌ణంగా ఇప్పుడు తాము ఆశ్ర‌మంలోకి రావ‌డానికి వీలు లేదని అధికారులు చెబుతున్నార‌ని మీడియాకు చెప్పారు.

ఆ ఆశ్ర‌మంలో మైన‌ర్ అమ్మాయిల‌కు కేర్‌టేక‌ర్ గా ఉంటోన్న ఓ వ్య‌క్తి శ్ర‌ద్ధ అదృశ్యంపై మాట్లాడుతూ... డేరా బాబాకు శిక్ష ఖ‌రారైన రోజు నుంచి ఆమె క‌నిపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ అమ్మాయి డేరాకు చెందిన వేరే ఆశ్ర‌మానికి వెళ్లిందేమోన‌ని తాము త‌మ ఇత‌ర ఆశ్ర‌మాల అధికారుల‌ను కూడా సంప్ర‌దిస్తున్నామని తెలిపారు. డేరా బాబా ఆశ్ర‌మం నుంచి ఇప్ప‌టికే కొంత‌మంది బాలిక‌లు బ‌య‌టకు వ‌చ్చేశారు. మ‌రికొంత మంది బాలిక‌లు మాత్రం తాము అక్క‌డే ఉంటామ‌ని తేల్చిచెబుతున్నారు. 

More Telugu News