: 288 రోజుల త‌ర్వాత భూమికి తిరిగి వ‌స్తున్న వ్యోమ‌గామి పెగ్గీ విట్స‌న్‌

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)లో 288 రోజుల ప‌రిశోధ‌న కార్యక్ర‌మాలు పూర్తి చేసుకున్న అమెరిక‌న్ వ్యోమ‌గామి పెగ్గీ విట్స‌న్ భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 6:52 గంట‌ల‌కు భూమ్మీద దిగ‌నున్నారు. ఆమెతో పాటు నాసాకు చెందిన జాక్ ఫిష‌ర్‌, ర‌ష్యా వ్యోమ‌గామి ఫ్యాదోర్ యూర్చిఖిన్‌లు కూడా రానున్నారు. ఈ యాత్ర‌తో ఆమె కెరీర్‌లో 665 రోజులు అంత‌రిక్షంలో గ‌డిపిన‌ట్ల‌యింది. అంత‌రిక్షంలో ఎక్కువ రోజులు గ‌డిపిన వ్యోమ‌గాముల జాబితాలో జెఫ్ విలియ‌మ్స్ 534రోజుల రికార్డును దాటేసి పెగ్గీ ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. అంత‌రిక్షంలో ఎక్కువ సార్లు స్పేస్‌వాక్ చేసిన మ‌హిళ‌గా పెగ్గీ ఇంత‌కుముందే రికార్డు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ యాత్ర‌తో ఫిష‌ర్‌, యూర్చిఖిన్‌లు త‌మ 136 రోజుల అంత‌రిక్ష‌యాత్ర‌ను పూర్తిచేసుకున్న‌ట్ల‌యింది. వీటితో క‌లిపి యూర్చిఖిన్ త‌న కెరీర్‌లో 673 రోజుల అంత‌రిక్ష‌వాసం పూర్తి చేసుకుని వ్యోమ‌గాముల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ప్ర‌స్తుతం ఐఎస్ఎస్‌లో ర‌ష్యా వ్యోమ‌గామి సెర్జీ క‌ర్జాకిన్‌, యూర‌ప్ వ్యోమ‌గామి పావులో నెస్పోలీ ఉన్నారు. ఎక్స్‌పెడిష‌న్ 53లో భాగంగా సెప్టెంబ‌ర్ 12న అమెరిక‌న్ వ్యోమ‌గాములు మార్క్ వాండే హే, జోయి అకాబా, ర‌ష్యా వ్యోమ‌గామి అలెగ్జాండ‌ర్ మిసుర్కిన్‌ల‌ను నాసా ఐఎస్ఎస్‌కి పంపించ‌నుంది.

More Telugu News