: కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై కొనసాగుతున్న మంతనాలు!

కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు కొనసాగుతున్నాయి. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. మరో ఐదుగురు మంత్రులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడంతో కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేనట్టేనని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేత మురళీధర్ రావు పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఇంతవరకూ ధ్రువీకరించకపోవడం గమనార్హం. ఇక, ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వడం పైనా సందిగ్ధత కొనసాగుతోంది.

కేంద్ర మంత్రి వర్గంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయమై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చించారు. నిన్న రాత్రి  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ నివాసంలో సీనియర్ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకునే వారికి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందనుంది.

More Telugu News