: ‘ఇన్ఫోసిస్’ కొత్త చైర్మన్ నందన్ నీలేకని ఎటువంటి జీతభత్యాలు తీసుకోరట!

ఐటీ దిగ్గజ సంస్థ ‘ఇన్ఫోసిస్’కు కొత్త చైర్మన్ (నాన్ ఎగ్జిక్యూటివ్), డైరెక్టర్ (నాన్ ఇండిపెండెంట్) నందన్ నీలేకని ఎటువంటి జీతభత్యాలు తీసుకోరట. ఈ విషయాన్ని ‘ఇన్ఫోసిస్’ పేర్కొంది. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన నీలేకనికి ఈ సంస్థలో 0.93 శాతం వాటా కూడా ఉంది. 2010 ఆర్థిక సంవత్సరంలో డైరెక్టర్ హోదాలో జీతభత్యాల కింద ఆయన  రూ.34 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఎటువంటి జీతభత్యాలు ఆయన తీసుకోలేదనే విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కి చేసిన ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది.

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) అధికారి యూబీ ప్రవీణ్ రావు ఆ పదవిలో కొనసాగనున్నారని, 2017, మార్చి 31న షేర్ హోల్డర్స్ అనుమతించిన ప్రకారమే ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, తాత్కాలిక సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ రావుకు ఎటువంటి అదనపు పరిహారం అందదని ‘ఇన్ఫోసిస్’ తెలిపింది. ఈ సందర్భంగా నీలేకని మాట్లాడుతూ, సంస్థకు సరైన సీఈఓను తీసుకువచ్చేందుకు, బోర్డు పునర్నిర్మాణానికి, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడం వంటి అంశాలకు తాను ప్రాముఖ్యత నిస్తానని అన్నారు. కంపెనీ భవిష్యత్తుపై దృష్టి సారిస్తానని, సవాళ్లను స్వీకరించి ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, ‘ఇన్ఫోసిస్’ సీఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసిన అనంతరం, ఆగస్టు 24న నందన్ నీలేకనిని కొత్త చైర్మన్ (నాన్ ఎగ్జిక్యూటివ్), డైరెక్టర్ (నాన్ ఇండిపెండెంట్)గా నియమించారు.

More Telugu News