: రాష్ట్రపతికి ఘనస్వాగతం.. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న రామ్ నాథ్ కోవింద్

తిరుచానూరు అమ్మవారిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు, రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల, తిరుపతికి విచ్చేసిన రామ్ నాథ్ కోవింద్ కు రేణిగుంట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. సీఎంతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ ఉన్నారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.140 కోట్లతో నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రెండు పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రామ్ నాథ్ కోవింద్, తిరుమల శ్రీవారిని రేపు దర్శించుకోనున్నారు. 

More Telugu News