: ఇకపై కన్ఫమ్ అయిన రైల్వే టికెట్లను బదిలీ చేసుకోవచ్చు!

ముందుగా తీసుకున్న రైల్వే రిజర్వేషన్ టికెట్లను మన కుటుంబసభ్యుల పేరిట ఇకపై బదిలీ చేసుకునే అవకాశం రైల్వే శాఖ కల్పించనుంది. ఈ మేరకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం, కన్ఫమ్ అయిన రైల్వే రిజర్వేషన్ టికెట్లను రక్త సంబంధీకుల పేరిట బదిలీ చేసుకోవచ్చు. టికెట్టు కన్ఫమ్ అయిన తర్వాత ఒక కుటుంబంలోని వ్యక్తి ప్రయాణం రద్దయితే కనుక, ఆ టికెట్టును అతని కుటుంబ సభ్యులైన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భార్యకు సులువుగా బదిలీ చేసుకోవచ్చు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులు తమ సహ విద్యార్థికి రిజర్వేషన్ టికెట్టును బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. సదరు ప్రయాణికులు తమ టికెట్టును బదిలీ చేయాలంటే, కనీసం 24 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ సూపర్ వైజర్ కు గుర్తింపుకార్డు జిరాక్స్ సహా దరఖాస్తు సమర్పిస్తే టికెట్టు కోరిన వారి పేరిట బదిలీ చేస్తారు. కాగా, గత రెండేళ్లలో ప్రయాణికుల టికెట్ల రద్దు కారణంగా రైల్వే శాఖకు రూ.50 కోట్లు పైనే ఆదాయం సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News