: నేను నపుంసకుడిని.. నేనెలా రేప్ చేస్తాను? అన్న డేరాబాబా నోరు జడ్జి ఎలా మూయించారంటే...!

20 ఏళ్ల జైలు శిక్షకు గురైన డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ చివరి క్షణం వరకు శిక్షను తప్పించుకునేందుకు ఎంత తీవ్రంగా ప్రయత్నించాడన్న విషయాలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. విచారణ సందర్భంగా రోహ్ తక్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు హాజరైన గుర్మీత్... జడ్జికి తన వాదన వినిపిస్తూ, తాను 1990 నుంచి నపుంసకుడినని, తనకు లైంగిక‌ సామ‌ర్థ్యం లేద‌ని, శృంగారానికి ప‌నికి రా‌నని, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ రెండు రేప్‌లు ఎలా చేస్తాన‌ని ప్రశ్నించాడు.

కాగా, ఈ రేప్ కేసు ఆరోపణలు 1999లో రావడంతో తెలివిగా తన వాదన వినిపించాడు. అయితే విచారణ సందర్భంగా డేరాకు సంబంధించిన ఒక హాస్టల్ వార్డెన్ బాబా చాలా మంచివాడని సాక్ష్యమిస్తూ... ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా డేరా ఆశ్రమంలోని హాస్టల్ లోనే ఉంటున్నారని, ఆయన అందర్నీ బిడ్డల్లా చూసుకుంటారని సాక్ష్యమిచ్చారు. దీనిని గుర్తు చేసుకున్న జడ్జి జ‌గ్‌ దీప్ సింగ్.. నువ్వు నపుంసకుడివైతే నీకు ఇద్దరు కుమార్తెలెలా పుట్టారు? అని ప్రశ్నించారు. దీంతో గుర్మీత్ సింగ్ తెల్లమొహం వేశాడు. ఆ తరువాత అతని లాయర్లు గుర్మీత్ సింగ్ చాలా సామాజిక సేవ చేశాడని, రాజపోషకుడిలాంటి వ్యక్తికి శిక్ష విధించవద్దని సూచించారు. గుర్మీత్ ఏకంగా కోర్టులో ఏడుపులంకించుకున్నాడు. అయినప్పటికీ గుర్మీత్ కుట్రను అర్థం చేసుకున్న జడ్జి అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 

More Telugu News