: బ్రెయిన్ ట్యూమర్‌కు వైద్యులు ఆపరేషన్ చేస్తుంటే.. శాక్సోఫోన్ వాయిస్తూ ఎంజాయ్ చేసిన రోగి!

ప్రమాదకర బ్రెయిన్ ట్యూమర్‌ను వైద్యులు ఆపరేషన్ చేసి తొలగిస్తుంటే పేషెంట్ మాత్రం ఎంచక్కా శాక్సోఫోన్ వాయిస్తూ గడిపేశాడు. అమెరికాలో జరిగిందీ ఘటన. డాన్ ఫాబియో (27) కు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రాణం. పెద్దయ్యాక మ్యూజిక్ టీచర్‌గా స్థిరపడ్డాడు. ఇటీవల వైద్యులు ఆయన మెదడులో కణతి ఉన్నట్టు గుర్తించారు. దీనిని తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే శాక్సోఫోన్ అంటే చెవి కోసుకునే ఫాబియోను తెలివిలో ఉంచుతూనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

ఫాబియో శాక్సోఫోన్ వాయిస్తుండగానే మెదడుకు ఎమ్మారై స్కాన్ చేసిన వైద్యులు కణతి ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి ట్యూమర్‌ను తొలగించారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఫాబియో శాక్సోఫోన్ వాయిస్తూనే ఉన్నాడు. ఆపరేషన్ విజయవంతమై కణతిని తొలగించిన తర్వాత కూడా విజయాన్ని ఆస్వాదిస్తూ ఫాబియో మరోమారు శాక్సోఫోన్ వాయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, తొలిసారే కేన్సర్ వచ్చిందని పేర్కొన్నాడు. అయితే అదృష్టవశాత్తు అది తొలి దశలోనే బయటపడిందన్నాడు.  

More Telugu News