: తండ్రి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ‘రేమాండ్’ గ్రూప్ చైర్మన్ గౌతమ్!

తనపై తన కన్నతండ్రి విజయ్ సింఘానియా చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రేమాండ్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా అన్నారు. తన తండ్రి ఆస్తులకు కేవలం తాను మాత్రమే చట్టపరమైన వారసుడినని పేర్కొన్నారు. ముంబయిలోని బ్రీచ్ కాండీలో 37 అంతస్తుల జేకే హౌస్ విజయ్ పత్ సింఘానియా కుటుంబానికి చెందింది. ఈ విషయమై తండ్రీ కొడుకుల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో గౌతమ్ సింఘాల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రేమాండ్ గ్రూప్ లో తన తండ్రికి చెందిన దాదాపు వెయ్యికోట్లకు పైగా విలువ చేసే 37.17% వాటాను తనకు గిఫ్ట్ గా ఇచ్చానని ఆయన చెప్పడం కరెక్టు కాదని అన్నారు.

తమ సంస్థ కోసం రోజుకు పదహారు గంటలు చొప్పున ముప్పై ఐదేళ్ల పాటు తాను శ్రమించానని అన్నారు. సంస్థలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి తాను కష్టపడ్డానని, తమ కుటుంబం మధ్య ఉన్న అవగాహన మేరకే తాను కష్టపడ్డానని అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ, వ్యాపార లావాదేవీల్లో కుటుంబ రాజకీయాలను చొప్పించడం సబబు కాదని, వారసత్వ సంపదను కాపాడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, తమ సంస్థ చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో విజయవంతమైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తున్నానని అన్నారు.

 కాగా, తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబయిలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ‘రేమాండ్’ తన సొంత వ్యాపార సంస్థలాగా గౌతమ్ వ్యవహరిస్తున్నాడని కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో ఆయన ఆరోపించారు. అయితే, ఈ సమస్యను కుటుంబసభ్యులు సామరస్యంగా,స్నేహాపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఈ వ్యవహారం నేపథ్యంలో విజయ్ పత్ సింఘానియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 18న ఆయన తీవ్రమైన గుండేనొప్పితో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.  

More Telugu News