: ఆర్థిక సంవత్సరం 'ఏప్రిల్ - మార్చి'... మార్చే ఉద్దేశం లేని మోదీ!

బ్రిటీష్ పరిపాలన నుంచి నడుస్తున్న ఏప్రిల్ - మార్చి ఆర్థిక సంవత్సర చక్రాన్ని జనవరి - డిసెంబర్ గా మార్చాలని గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న మోదీ సర్కారు ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకుంది. మోదీ ఆలోచనకు పలు రాష్ట్రాలు ఆమోదం తెలపకపోవడం, మార్చితే వచ్చే లాభం ఏమీ ఉండబోదని భావించిన కేంద్రం, ఈ విషయాన్ని పక్కన పెట్టిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఫైనాన్షియల్ సైకిల్ ను మార్చితే ప్రయోజనాలు ఉండవని ఆర్థిక నిపుణులు స్పష్టం చేయడంతో మోదీ కూడా ఈ ఆలోచనను విరమించుకున్నారని తెలిపారు.

 కాగా, బ్రిటీష్ పాలనలో ఇండియాపై రుద్ది వెళ్లిన వారి అలవాట్లను ఒక్కొక్కటిగా వదిలించుకోవాలన్నది తన ఆలోచనని నరేంద్ర మోదీ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అది జరగాలంటే, అన్ని రాష్ట్రాలూ ఆమోదం పలకాల్సి వుంటుంది. పలు రాష్ట్రాలు అందుకు సానుకూలంగా లేవు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ విషయమై మరోసారి చర్చిద్దామని కేంద్రం నిర్ణయించుకుందని సదరు అధికారి తెలిపారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో ఇంతటి కీలక నిర్ణయం వద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. కాగా, ఈ ఆలోచన వెనక్కు వెళ్లడంతో, ఇక సాధారణ బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

More Telugu News