: హనీ ప్రీత్ సింగ్ అతని కూతురు కాదు...వారిది అంగీకారయోగ్యం కాని సంబంధం: గుర్మీత్ సింగ్ మాజీ బాడీ గార్డ్ సంచలన ప్రకటన

గుర్మీత్ రాం రహీం సింగ్ వారసురాలిగా సిర్సాలోని డేరా సచ్ఛా సౌధాలో పేర్కొంటున్న హనీ ప్రీత్ సింగ్ గురించి ఆశ్రమంలో బాడీ గార్డ్ గా పని చేసిన బియాంత్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా పక్కనే నిత్యం కనిపించే హనీప్రీత్‌ అతనిని తండ్రిగా పేర్కొంటుంది కానీ, వారిది ఆమోదయోగ్యమైన సంబంధం కాదని చెప్పారు. వారిద్దరూ చేసేది సిగ్గుపడాల్సిన విషయమని ఆయన అన్నారు. వాస్తవానికి ఆమె పేరు ప్రియాంక తనేజా అని ఆయన చెప్పారు. 1999లో సచ్చా డేరా ఫాలోవర్‌ విశ్వాస్‌ గుప్తా అనే యువకుడిని పెళ్లి చేసుకున్నాక ఆమె తన పేరును హానీ ప్రీత్‌గా మార్చుకుందని చెప్పాడు.

భర్తతో పాటు ఆమె ఆశ్రమానికి వచ్చేదని ఆయన అన్నారు. ఆయన గుర్మీత్ కు నమ్మకమైన భక్తుడు కావడంతో అతనికి ఎప్పుడంటే అప్పుడు ఆశ్రమానికి వచ్చే వెసులుబాటు ఉండేదని బియాంత్ సింగ్ తెలిపారు. అలాగే తన భార్యతో కూడా ఆయన వచ్చేవారని, గార్డులు కూడా వారిని ఆపేవారు కాదని ఆయన అన్నారు. అయితే ఒకరోజు ఆయన గుర్మీత్ ఆశ్రమానికి వచ్చేసరికి... ఆయన భార్య గుర్మీత్ బెడ్‌ రూమ్‌ లో, ఆయనతో అభ్యంతరకర స్థితిలో కనిపించిందని, ఈ విషయాన్ని విశ్వాస్‌ గుప్తానే గతంలో మీడియాకు కూడా తెలియజేశారని బాడీగార్డ్ తెలిపాడు.

 దీంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి, మీడియా ముందు బాబా గుట్టు రట్టు చేశారని, వెంటనే ఆమె చేత తన అత్తమామలు కట్నం కోసం తనను వేధిస్తున్నారని కేసు పెట్టించారని గుర్తు చేశారు. ఆ తరువాత తన పలుకుబడితో వారిపై మరిన్ని కేసులు పెట్టి, మానసికంగా వారిని హింసించారని, తరువాత భరణం పేరుతో వారి ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారని బియాంత్ సింగ్ తెలిపారు. ఇప్పుడు హనీ ప్రిత్ సింగ్ గా మారి, గుర్మీత్ దత్త పుత్రికగా సిర్సాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. జైల్లో కూడా ఆమె తనతో ఉండాలని బాబా కోరారని గుర్తు చేశారు.

కాగా, డేరా సచ్చా సౌధాలో కీలకమైన ఆమెకు ట్విట్టర్‌ లో పది లక్షల మంది, ఫేస్‌ బుక్‌ లో ఐదు లక్షల మంది, ఇన్‌ స్టాగ్రామ్‌ లో 1,88,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమె ఒక వెబ్ సైట్ ను కూడా నిర్వహిస్తోంది. ఈ వెబ్ సైట్ లో గుర్మీత్ ను దైవం, రాజులకు రాజు అంటూ కీర్తిస్తుంది. గుర్మీత్ తీసిన 'ఎంఎస్‌జీ ది వారియర్‌, లైన్‌ హార్ట్‌' సిరీస్‌ సినిమాల దర్శకత్వ బాధ్యతలతో పాటు నటన బాధ్యతలు కూడా హనీ ప్రీత్ తీసుకుంది. ఈ సినిమాల్లో 30 అంశాల్లో తన పేరును క్రెడిట్ లైన్ లో వేసుకుంది. అంతే కాకుండా తాను గొప్ప దర్శకులరాలినని, నటినని, ఫిల్మ్‌ ఎడిటర్‌ నని, రచయితనని, అన్నింటికన్నా సింగ్‌కు గొప్ప కూతురునని చెప్పుకుంటుంది.

More Telugu News