: అంత గొప్పలు పోయిన చైనా ఎందుకు వెనక్కి తగ్గింది చెప్మా?

ఇన్నాళ్లూ బీరాలు పలికిన చైనా ఒక్కసారిగా ఎందుకు తగ్గింది? సుమారు 70 రోజుల డోక్లాం ప్రతిష్ఠంభనకు అకస్మాత్తుగా తెర ఎలా పడింది? డోక్లాం ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించి, యుద్ధానికి సిద్ధమని రంకెలు వేసిన చైనాకు ఎవరు ముకుతాడు వేశారు? అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గడానికి కారణాలేంటి? అన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తిన సందేహాలు. దీనిపై విదేశీ వ్యవహారాల నిపుణులు మాత్రం క్లారిటీ ఇస్తున్నారు.

డోక్లాంలో దూకుడుగా వ్యవహరించి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం ఇష్టం లేని చైనా వ్యూహాత్మకంగా ఇండియా ముందు తలవంచిందని వారు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం, వచ్చే నెల 3 నుంచి 5 వరకు చైనాలోని జియామెన్‌ లో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సు జరగనుంది. ‘మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం’ అనే థీమ్‌ తో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని చైనా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో డోక్లాం వివాదంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు గైర్హాజరు కావడం పెద్ద విషయం కాదు. చివరి నిమిషంలో మోదీ హాజరుకాకుండా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్రిక్స్ థీమ్ లో ‘బలమైన భాగస్వామ్యం’ అనే పదానికే అర్థం లేకుండా పోతుంది. మరోవైపు సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతంపై భాగస్వామ్య దేశాలతో పరిష్కారం చేసుకోకుండా, ఆ ప్రాంతంలో యథాతథస్థితిని మీరడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. దీంతో చైనా చర్యను ఏ ప్రపంచ దేశమూ కొనియాడలేదు.

చర్చల ద్వారా ప్రతిష్ఠంభన తొలగించుకోవాలని అమెరికా, యూకే దేశాలు చైనాకు సూచించగా, జపాన్ నేరుగా చైనాదే తప్పని స్పష్టంగా చెప్పింది. దీంతో చైనా గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయింది. మరోవైపు నేపాల్ మద్దతు తీసుకోవాలని చైనా ప్రయత్నించినా, ఆ దేశం తటస్థంగా ఉండేందుకు మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఉత్తరకొరియా తీరుతో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదే సమయంలో 70 రోజుల పాటు భారత్ పై విద్వేష కథనాలతో చైనీయుల్లో ఆగ్రహం నింపిన మీడియా తీరు కూడా ఆ దేశ పరిపాలకులపై ఒత్తిడి పెంచింది.

 మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో సీపీఈసీ నిర్మాణం చేపట్టింది. భారత్ వెంబడి ఉన్న సుదీర్ఘ సరిహద్దు మొత్తంలో భారత్ కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల చైనా చుట్టూ ఉన్న భారత మిత్రదేశాలతో చైనాకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం, ఉత్తరకొరియాతో స్నేహ సంబంధాలతో ప్రపంచ దేశాలకు వ్యతిరేకిగా తయారైన చైనా, మరిన్ని సమస్యలు కొనితెచ్చుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో భారత్ తో యుద్ధం సాధ్యాసాధ్యాలను పరిశీలించిన చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే మేకపోతు గాంభీర్యంతో ‘డోక్లాంలో మా గస్తీ కొనసాగుతుంది’ అంటూ బింకాలు పోతోంది.  

More Telugu News