: లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న నావికుడిపై వేటుకు సిద్ధమైన నేవీ!

మహిళనైన తాను మగాడి శరీరంలో ఇరుక్కుపోయానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నావికుడిపై వేటుకు రంగం సిద్ధమైంది. పురుషుడిగా ఉద్యోగంలో చేరిన అతడి ప్రవర్తనలో అనూహ్య మార్పు వచ్చింది. అంతేకాక లింగమార్పిడి సైతం చేయించుకోవడంతో నేవీ అధికారులు ఆ విషయాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆమె’ను తొలగించనున్నట్టు సమాచారం అందించారు.

విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ ఏకశిలా బేస్‌లో పనిచేస్తున్న అతడు (ఆమె) గతేడాది ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. నేవీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఏడేళ్ల క్రితం మగాడిగా ఆమె ఉద్యోగంలో చేరిందని అధికారులు తెలిపారు. కాగా, 1990 నుంచి సాయుధ దళాల్లోని ఆఫీసర్ల పోస్టులకు మహిళలను ఎంపిక చేస్తున్నా..  నావికులుగా, సైనికులుగా ఇప్పటి వరకు ఎవరినీ అనుమతించలేదు. దీంతో  అతడిని (ఈమెను) విధుల నుంచి తప్పించాలని నిర్ణయించిన అధికారులు  ఆ విషయాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

ఏడేళ్ల క్రితం నేవల్ మెకానికల్ ఇంజినీరింగ్ వింగ్‌లో చేరిన అతడికి (ఆమెకు) వివాహమై ఓ బాబు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈమెను (అతడిని) విధుల నుంచి తప్పిస్తే కనుక పెన్షన్ కూడా వచ్చే అవకాశం లేదు. పింఛన్ రావాలంటే నేవీలో కనీసం 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. కాగా,  ట్రాన్స్‌జెండర్లు యూఎస్ ఆర్మీలో చేరడంపై నిషేధం విధిస్తూ గతవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.


 

More Telugu News