: చట్టం ఎవరబ్బ చుట్టమూ కాదు: డేరా అనుచరులపై విరుచుకుపడ్డ మోదీ

తనను తాను దైవాంశ సంభూతునిగా చెప్పుకునే గుర్మీత్ కు శిక్ష ఖరారైన నేపథ్యంలో, ఆయన అనుచరులు చేస్తున్న హింసాత్మక ఘటనలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వినిపించిన ఆయన, చట్టం ఎవరికీ చుట్టం కాదని, కోర్టుల ముందు ప్రజలంతా సమానమేనని స్పష్టం చేశారు. నిరసనలు శాంతియుతంగా మాత్రమే చేసుకోవాలని, హింసకు దిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోయేది లేదని మోదీ హెచ్చరించారు.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, పరిశుభ్ర వాతావరణంలో పండగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణం పట్ల యువత అవగాహన పెంచుకోవాలని, ఈ విషయంలో గణేష్ విగ్రహాలే నాంది కావాలని అన్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని తెలిపారు.

దేశంలో ఎన్నో గ్రామాల్లో ఇప్పుడు బహిరంగ మల విసర్జన జరగడం లేదని వెల్లడించిన ఆయన, స్వచ్ఛ భారత్ కల సాకారం దిశగా జరుగుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో ప్రజలు అందించే సూచనలను తాను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుత యువత కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు పరిమితమై, మైదాన క్రీడలకు దూరం అవుతుండటం తనను ఆందోళన పరుస్తోందని, భారత యువత మైదాన క్రీడల్లో రాణించాలని అన్నారు. ఆరుగురు భారతీయ మహిళా నావికులు ప్రపంచమంతా చుట్టి వచ్చారని, ఈ విషయం తెలిసిన తరువాత తనకెంతో గర్వంగా అనిపించిందని తెలిపారు. ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు ఇండియాకు వస్తున్న ప్రతి దేశపు జట్టుకూ తాను స్వాగతం పలుకుతున్నానని, ఇక్కడి సంస్కృతి, ఆతిథ్యం వారికి తప్పకుండా నచ్చుతుందనే భావిస్తున్నానని తెలిపారు.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన విజయవంతం అయిందని, ఎన్నో దేశాలు ఈ స్కీమ్ ను నిశితంగా గమనిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వ్యవస్థకు పన్ను రూపంలో వచ్చే కొంత మొత్తం కూడా ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ప్రజల జీవన విధానాన్ని మార్చడం వెనుక తొలి అడుగు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే సమయంలోనే వారికి అన్ని రకాల అంశాలపైనా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాయం అవసరమైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News