: బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీకి 'ఇంటి' కష్టాలు!

ప్ర‌జ‌లంతా వినాయ‌క చ‌వితి సంబ‌రాల్లో మునిగి తేలుతున్న వేళ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రాణీ ముఖర్జీ మాత్రం ఈ ఉత్స‌వాల‌ను ఎంజాయ్ చేయ‌లేక‌పోతోంది. ఎందుకంటే ఆమెకు ఈ మ‌ధ్యే బృహాన్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) నుంచి లీగల్ నోటీసులు వ‌చ్చాయి. ఎందుకంటే, ఆమె ముంబయ్ ‌లోని జుహులో త‌న‌కు ఉన్న‌ కృష్ణారామ్ బంగ్లా పునఃనిర్మాణ ప‌నులు చేయిస్తోంది. అయితే, ఆమె ఆ నిర్మాణాన్ని ప్రారంభించ‌డానికి బీఎంసీ నుంచి అనుమ‌తి తీసుకోలేదు.

ఆ ఇంటి నిర్మాణ ప‌నుల ప్రారంభానికి సంబంధించి అనుమతి ఇస్తూ 2014లో ఆమెకు ఎంబీసీ నుంచి స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. దాని వ్యాలిడిటీ న‌వంబ‌రు, 2015 లో ముగిసింది. దాన్ని మ‌ళ్లీ రెన్యూవ‌ల్ చేయించుకోకుండానే ఆమె బంగ్లా నిర్మాణ ప‌నులు చేప‌ట్టింది. ఈ విష‌యాన్ని గుర్తించిన ప‌లువురు సామాజిక కార్య‌క‌ర్తలు ఇది అక్ర‌మ నిర్మాణ‌మే అంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రాణీ ముఖ‌ర్జీకి చెందిన ఓ వ్య‌క్తి మాట్లాడుతూ... తాము ప్ర‌తి ఏడాది రెన్యూవ‌ల్ చేయించుకుంటూనే ఉన్నామ‌ని, మొద‌ట నిర్ణ‌యించిన ప్లాన్ ప్ర‌కార‌మే బంగ్లా నిర్మాణం చేప‌డుతున్నామ‌ని, బంగ్లా ఎంత ఎత్తువ‌ర‌కు నిర్మించ‌వ‌చ్చ‌న్న నిబంధ‌న‌ను పాటిస్తూ ఆ ప్ర‌కార‌మే నిర్మాణం చేప‌ట్టామ‌ని చెప్పారు.

కానీ, ఇటీవ‌లే ఆ  బంగ్లాను సంద‌ర్శించిన బీఎంసీ అధికారులు... రాణీ ముఖ‌ర్జీకి ఇప్ప‌టికే ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ యాక్ట్ 488 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న అధికారులు పోలీసుల‌తో క‌లిసి మ‌రోసారి ఆ బంగ్లా వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు.  

More Telugu News