: అమెరికా ఇంటెలిజెన్స్ చేతిలో కోట్లాది మంది భారతీయుల ఆధార్ డేటా.. తీవ్ర ఆందోళన!

కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చేతిలోకి వెళ్లాయనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో సంచలనాలను, కుంభకోణాలను, కుట్రలను వెలికి తీసిన వికీలీక్స్ సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కోట్లాది మంది భారతీయుల ఆధార్ డేటాను సీఐఏ చోరీ చేసిందని తెలిపింది. క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన టూల్స్ ను ఉపయోగించుకుని... సీఐఏ ఈ ఘాతుకానికి పాల్పడిందని వెల్లడించింది. ఇదే క్రాస్ మ్యాచ్ సంస్థ మన ఆధార్ కు సంబంధించి బయోమెట్రిక్ సొల్యూషన్స్ ను అందిస్తోంది.

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ఈ చోరీ సమాచారం బయటకు పొక్కడంతో, సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, దీనిపై స్పందించిన అధికారులు చోరీ జరగలేదని, ఈ వార్తలన్నీ అవాస్తవమని చెబుతున్నారు. వికీలీక్స్ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. అయితే, ఓ గుర్తు తెలియని వెబ్ సైట్లో ఈ రిపోర్టు ఉందనే విషయాన్ని తాము గుర్తించామని తెలిపారు. క్రాస్ మ్యాచ్ సంస్థ కేవలం బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసే సంస్థ మాత్రమేనని... ఇతర విషయాలతో దానికి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ డేటాను తాము పూర్తిగా ఎన్ క్రిప్ట్ చేశామని... దాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తప్ప మరే ఇతర ఏజెన్సీ కూడా డీక్రిప్ట్ చేయలేదని తెలిపారు. 

More Telugu News