: ‘చిన్నమ్మ’ను సాగనంపేందుకు సర్వం సిద్ధం.. వచ్చే నెల 15న ముహూర్తం!

అన్నాడీఎంకే (అమ్మ) నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు కష్టం మీద కష్టం వచ్చిపడుతోంది. వైరి వర్గాలుగా ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీరు సెల్వం ఒక్కటి కావడంతో ప్రారంభమైన కష్టాలు రోజురోజుకు మరింతగా చుట్టుముడుతున్నాయి. తాజాగా పార్టీ నుంచి ఆమెను సాగనంపేందుకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 15వ తేదీని అందుకు ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ రోజున పార్టీ సర్వసభ్య  సమావేశాన్ని నిర్వహించి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు.

అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తుండగా ఆమె వెళ్తూవెళ్తూ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన టీటీవీ దినకరన్ అనేక కేసుల్లో ఇరుక్కుని పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. వీరిద్దరి వల్ల ప్రభుత్వ అస్థిత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన ఎడపాడి.. చిన్నమ్మ కుటుంబాన్ని పార్టీ నుంచి పూర్తిగా బయటకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పన్నీర్‌తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇక శశికళ స్థానంలో మరొకరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం ద్వారా పార్టీతో శశికళకు ఎటువంటి సంబంధం లేకుండా చేయాలని నిర్ణయానికి వచ్చారు.

అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబరు 15న పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రధాన కార్యదర్శిగా కొత్త వ్యక్తిని ఎన్నుకునేందుకు పళనిస్వామి పావులు కదుపుతున్నారు. పార్టీలోని 600 మంది సభ్యుల సంతకాల సేకరణ పూర్తికాగానే తేదీని ప్రకటించే అవకాశం ఉందని పళని వర్గీయులు చెబుతున్నారు.

More Telugu News