తమిళ ప్రజల దృష్టిని 'సైరా' వైపు మళ్లించిన విజయ్ సేతుపతి!

24-08-2017 Thu 10:44
చిరంజీవి పుట్టినరోజున 'సైరా నరసింహా రెడ్డి' సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అదే విధంగా ముఖ్య తారాగణానికి సంబంధించిన జాబితాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడనే విషయం తెలియగానే తమిళ ప్రజల దృష్టి ఈ సినిమా వైపుకు మళ్లింది. విజయ్ సేతుపతి ఒక పాత్రను అంగీకరించాడంటే అందులో చాలా విషయమే వుంటుందనే విషయాన్ని అక్కడి వాళ్లు బలంగా నమ్ముతారు.

అందువలన 'సైరా' సినిమా గురించిన విశేషాలపై వాళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ లో కనిపిస్తాడట. భారతీయుడై వుండి ఆంగ్లేయులకు సహకరిస్తూ నరసింహా రెడ్డికి అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాడని అంటున్నారు. చివరికి నరసింహా రెడ్డి గొప్పతనం తెలుసుకుని ఆంగ్లేయులనే ఎదిరించి ప్రాణ త్యాగం చేస్తాడట. ఇంతటి బలమైన పాత్ర కనుకనే విజయ్ సేతుపతి ఓకే చెప్పేశాడన్న మాట.