చిరూ కోసం 'స్పైడర్ మేన్' ఫైట్ మాస్టర్ ను రంగంలోకి దింపుతున్నారట!

23-08-2017 Wed 12:36
చిరంజీవి 151వ సినిమాకి 'సైరా నరసింహా రెడ్డి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 200 కోట్లు ఖర్చు కావొచ్చనే అంచనాకి వచ్చినట్టు సమాచారం. భారీ తారాగణం, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్ అవసరం కావడం వలన ఆ స్థాయిలో ఖర్చు ఉండొచ్చని భావిస్తున్నారు.

చారిత్రక నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా వుండాలని చిరంజీవి భావించారట. దాంతో 'స్పైడర్ మేన్' వంటి పలు హాలీవుడ్ సినిమాలకి, బాలీవుడ్ లో 'క్రిష్' సినిమాలకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన 'టోని చింగ్' ను దర్శక నిర్మాతలు రంగంలోకి దింపారు. చాలా డిఫరెంట్ గా ఆయన ఫైట్స్ ను కంపోజ్ చేస్తాడని అంటున్నారు. అవి ఈ సినిమాకి హైలైట్ కానున్నాయని చెబుతున్నారు. మొత్తానికి 'సైరా నరసింహా రెడ్డి' ఒక రేంజ్ లో వుండబోతుందన్న మాట.