: ఉత్తర కొరియా తప్పకుండా అమెరికాపై అణుదాడి చేస్తుంది: నిఘా సంస్థల హెచ్చరికలు

ఉత్తర కొరియాది మేకపోతు గాంభీర్యం కాదని, దాని గాండ్రింపులు ప్రమాదకరమైనవని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఆ దేశానికి నివేదిక సమర్పించారు. అమెరికాను దారుణంగా దెబ్బతీస్తామని ఉత్తరకొరియా ఊరికే అనడం లేదని చెబుతున్న అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు... దానికి సంబంధించి పలు సాక్ష్యాలను చూపిస్తున్నారు. ఉత్తర కొరియా మొట్టమొదటి సారి 1984లో న్యూక్లియర్ క్షిపణి ప్రయోగం ప్రారంభించిందని, అప్పట్లో దాని పరిధి, ప్రభావం కూడా చాలా తక్కువని అమెరికా నిఘా విభాగం తెలిపింది. 1990లో రెండోసారి న్యూక్లియర్ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా, ఈ సారి దాని పరిధి, ప్రభావాన్ని పెంచిందని తెలిపింది. దీంతో తాము న్యూక్లియర్ దాడుల్లో ఎవరినైనా తలవంచేలా చేయగలమనే ధీమా ఉత్తర కొరియాకు వచ్చిందని చెప్పింది.

తరువాత సుదీర్ఘ కాలం న్యూక్లియర్ ఆయుధ ప్రయోగాలకు విరామమిచ్చిన ఉత్తర కొరియా 2017 జూలైలో మరోసారి అణుక్షిపణి ప్రయోగాలను మొదలు పెట్టింది. ఈసారి సరికొత్త టెక్నాలజీ సాయంతో ఈ పరీక్షలు నిర్వహించిందని తెలిపింది. దీంతో కాలిఫోర్నియాను బూడిద చేయగల న్యూక్లియర్ టెక్నాలజీని సొంత చేసుకుందని వారు తెలిపారు. న్యూక్లియర్ ప్రయోగాలకు రాకెట్ ఇంజన్లను అమర్చడం ద్వారా వారి లక్ష్య ఛేదన దూరం పెరిగిందని వారు వెల్లడించారు. అయితే అమెరికాపై అణుదాడికి దిగడం అంటే ఉత్తర కొరియా ఆత్మహత్యకు పాల్పడడం వంటిదని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది. అయితే ఒకేసారి అమెరికాలోని పట్టణాలన్నింటినీ నాశనం చేయవచ్చని కిమ్ జాంగ్ ఉన్ పగటి కలలు కంటున్నారని అమెరికా నిఘా విభాగం తెలిపింది. 

More Telugu News