: నైకీపై టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి... హుటాహుటీన కొత్త కిట్లు పంపిన నైకీ

టీమిండియా ఆటగాళ్లకు 2006 నుంచి వాడుతున్న కిట్లు బోర్ కొట్టేసినట్టు ఉన్నాయి. 2006 నుంచి నైకీ సంస్థ టీమిండియాకు జెర్సీలు, షూస్ ను సరఫరా చేస్తోంది. ఇన్నేళ్లలో ఆ సంస్థపై లేని ఫిర్యాదులు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. గత కొన్ని నెలలుగా వివిధ మ్యాచ్‌ లలో తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయని కెప్టెన్‌ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి తెలుసుకున్న నైకీ సంస్థ నలుగురు ఉన్నతాధికారులతో బెంగళూరు నుంచి హుటాహుటీన కొత్త కిట్లు పంపించింది.

టీమిండియా ఆటగాళ్లు, అధికారులతో నైకీ ఉన్నతాధికారుల బృందం మాట్లాడింది. ధోనీ, రోహిత్ శర్మలు కొత్త కిట్లను పరిశీలించి, తమ అభిప్రాయాలు వివరించారు. కాగా, 2020 సెప్టెంబర్‌ వరకు టీమిండియాతో నైకీకి కాంట్రాక్ట్‌ ఉంది. ఈ కాంట్రాక్ట్ కోసం గత ఏడాది నైకీ బీసీసీఐకి 370 కోట్ల రూపాయలు చెల్లించింది. తమ బ్రాండ్ ఉత్పత్తులను ధరిస్తున్నందుకు ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు 87 లక్షల 34 వేల రూపాయలను నైకీ చెల్లిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల సూచనల మేరకు మార్పులతో కొత్త కిట్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News