: పర్వేజ్ ముషారఫ్ కు పరాభవం!

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరో పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్ కు చెందిన ఓ ప్రైవేట్ ఛానల్ ఈ నెల 24న ముషారఫ్ తో ఓ చర్చా వేదికను ఏర్పాటు చేసింది. దీనికోసం లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ విద్యాలయాన్ని వేదికగా ఎంచుకుంది. ఈ చర్చలో తనపై పడ్డ అనర్హత వేటు, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ముషారఫ్ చర్చించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ముషారఫ్ కార్యక్రమానికి అనుమతిని ఇవ్వరాదంటూ యూనివర్శిటీ యాజమాన్యానికి పాకిస్థాన్ లోని పలు సంస్థల నేతలు లేఖలు రాశారు. ఈ చర్చా కార్యక్రమం జరిగితే... పాక్ లో జరిగిన నేరాలకు, హింసకు, మిలిటరీ తిరుగుబాట్లకు ఈ యూనివర్శిటీ పరోక్షంగా మద్దతు పలికినట్టు అవుతుందని వారు లేఖలో పేర్కొన్నారు. దీంతో యూనివర్శిటీ వెనక్కి తగ్గింది.

ముషారఫ్ ప్రసంగిస్తే నిరసన తెలిపేందుకు మూడు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని... నిరసనలు జరిగితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని... ఈ కారణంగా ముషారఫ్ కార్యక్రమానికి అనుమతిని నిరాకరిస్తున్నామని యూనివర్శిటీ ప్రకటించింది. గతంలో కూడా నోబెల్ శాంతి సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముషారఫ్ ప్రసంగిస్తుండగా,నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, ఆయన అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

More Telugu News