: విశాల్ సిక్కా రాజీనామా తరువాత... ఇన్ఫోసిస్ పై యూఎస్ లా సంస్థల విచారణ!

ఇన్ఫోసిస్ నుంచి తొలి నాన్ ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న విశాల్ సిక్కా రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ ఇన్ఫోసిస్, ఇప్పుడు మరింత చిక్కుల్లో పడింది. ఇన్ఫోసిస్ పై పలువురు ఇన్వెస్టర్లు చేసిన ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ఏజన్సీ విచారణ చేపట్టనుంది. ఇన్ఫోసిస్, దాని కార్యాలయాల్లో, డైరెక్టర్లూ ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను అతిక్రమించారా? అన్న విషయమైన నాలుగు యూఎస్ లా సంస్థలు విచారణ చేపట్టాయి. బ్రాన్ స్టియన్, జివిర్ట్ అండ్ గ్రాస్ మన్, రోసెన్ లా ఫర్మ్, పోమెరాంట్జ్ లా ఫర్మ్ అండ్ గోల్డెబెర్గ్ లా పీసీ సంస్థలు ఈ విచారణ చేపట్టనున్నాయి. సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేస్తున్న తప్పుడు ప్రచారంతోనే సిక్కా బలవంతంగా సంస్థను వీడాల్సి వచ్చిందని బోర్టు చేసిన ఆరోపణలపైనా వీరు దృష్టిని సారించనున్నారు.

ఇన్ఫీపై తమ క్లయింట్లుగా ఉన్న ఇన్వెస్టర్లు చేసిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టినట్టు రోసెన్ ఓ ప్రకటనలో తెలిపింది. సంస్థలో జరుగుతున్న పరిణామాలు తమ ఇన్వెస్టర్ల పెట్టుబడులను నష్టాల్లోకి నెట్టినందున క్లస్ యాక్షన్ లా సూట్ వేసేందుకూ సిద్ధమవుతున్నట్టు తెలిపింది. సంస్థలో సెక్యూరిటీస్ మోసాలు, చట్ట వ్యతిరేక వ్యాపార కార్యకలాపాలు జరిగాయన్న ఆరోపణలపై తాము విచారించనున్నట్టు పొమెరాంట్జ్ తెలిపింది. కాగా, నష్ట నివారణ చర్యల్లో భాగంగా, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను నిలిపేందుకు రూ. 13 వేల కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను బై బ్యాక్ చేస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News