: ఇంటిలో టాయిలెట్ లేకపోవడం క్రూరత్వమే.. కోర్టు సంచలన వ్యాఖ్యలు.. విడాకులు మంజూరు!

దేశంలో తొలిసారి ఇంటిలో టాయిలెట్ లేదన్న కారణంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇంటిలో టాయిలెట్ లేకపోవడం హింస కిందికే వస్తుందని వ్యాఖ్యానించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇంటిలో టాయిలెట్, బాత్రూం నిర్మించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా తన భర్త పట్టించుకోవడం లేదని, దీంతో బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోందని, ఇక తనవల్ల కాదని, తనకు విడాకులు ఇప్పించాలంటూ రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన ఓ మహిళ (24) 2015లో కోర్టును ఆశ్రయించింది. ఇంటిలో టాయిలెట్ నిర్మించకుండా తనను హింసిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసును విచారించిన భిల్వారాలోని కుటుంబ న్యాయస్థానం ఇంటిలో టాయిలెట్ లేకపోవడం హింస కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ‘‘మనం డబ్బుల్ని సిగరెట్లు, మందు, మొబైల్ ఫోన్లు కొనడానికి ఉపయోగిస్తాం తప్పితే కుటుంబ గౌరవాన్ని కాపాడే టాయిలెట్ నిర్మాణానికి వెచ్చించలేకపోవడం దురదృష్టకరమని’’ వ్యాఖ్యనించింది. ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో గ్రామాల్లోని మహిళలు సూర్యాస్తమయం వరకు ఆగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది శారీరక హింసకంటే ఘోరమైనదని వ్యాఖ్యానిస్తూ ఆమెకు విడాకులు మంజూరు చేసింది.

More Telugu News