: బీహార్ లో కళ్ల ముందే ఘోరం... బ్రిడ్జి దాటుతుంటే కుప్పకూలి కొట్టుకుపోయిన కుటుంబం... వీడియో ఇదిగో!

గత మూడు నాలుగు రోజులుగా బీహార్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులూ, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, ఓ వంతెనను దాటుతున్న కుటుంబం, వందలాది మంది చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరారియా జిల్లాలో జరిగిన ఈ ఘటనను కొందరు స్థానికులు చిత్రీకరించారు. నీటి ప్రవాహానికి కొట్టుకువస్తున్న ఓ పెద్ద చెట్టు బ్రిడ్జిని కుప్పకూల్చింది.

అంతకుముందు కొంతమంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరుగులు పెట్టారు. ఓ కుటుంబం పరుగుపెడుతున్న వేళ వంతెన కూలిపోయింది. నీటిలో పడ్డవారు క్షణాల్లో అదృశ్యమయ్యారు. కాగా, బీహార్ లో భారీ వర్షాల కారణంగా సుమారు 120 మంది చనిపోగా, కోటి మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో ప్రాంతాల్లో రైళ్లు నిలిచిపోయాయి. 14 జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నిరాశ్రయులైన ప్రజలకు సహకారాన్ని అందిస్తున్నాయని డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అనిరుద్ కుమార్ వెల్లడించారు. తమకు ఎదురైన సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ '104'కు వెల్లడించాలని పిలుపునిచ్చారు.

More Telugu News