: గ్యాంగ్ స్టర్లలో మొదలైన వణుకు... తొమ్మిదేళ్ల తరువాత తిరిగి విధుల్లోకి వచ్చిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ

దశాబ్దం క్రితం ముంబై గ్యాంగ్ స్టర్లను ఉరుకులు, పరుగులు పెట్టించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ సూర్యవంశీ శర్మను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. 2006లో గ్యాంగ్ స్టర్ రామ్ నారాయణ్ గుప్తాను ప్రదీప్ శర్మ ఎన్ కౌంటర్ లో కాల్చి చంపగా, ఆ కేసులో ఆరోపణలపై 2008లో ఆయన్ను విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై కేసు విచారణ సుదీర్ఘకాలం సాగగా, ఆయనపై వచ్చిన ఆరోపణలను ఇటీవల కోర్టు కొట్టివేసింది.

2006, నవంబర్ 11న రామ్ నారాయణ్ ఎన్ కౌంటర్ జరుగగా, ప్రదీప్ తో పాటు 13 మంది పోలీసులు సహా మొత్తం 20 మందిపై హత్య కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు అందరూ నిర్దోషులేనని తేల్చింది. 1983లో పోలీసు దళంలో చేరిన ప్రదీప్, ముంబైలో జరిగిన ఎన్నో ఎన్ కౌంటర్లలో స్వయంగా పాల్గొన్నారు. దావూద్ గ్యాంగ్ పేరును వినిపించకుండా చేయడంలో ఈయన పాత్రే అధికం. లఖన్ భయ్యా ఎన్ కౌంటర్ లోనూ ప్రదీప్ దే కీలకపాత్ర. కాగా, ప్రదీప్ తిరిగి విధుల్లో చేరనుండటంతో, ముంబైలో గ్యాంగ్ స్టర్లు మరోసారి వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News