: రాత్రింబవళ్లూ చంద్రబాబు కష్టపడుతుంటే, ఒక్క ఘటనతో చెడ్డపేరు!: బాలయ్య వైఖరిపై టీడీపీ నేతల ఆందోళన!

నిన్న రాత్రి నంద్యాలలో తాను బస చేసిన హోటల్ వద్ద ఓ తెలుగుదేశం కార్యకర్త చెంపపై హీరో బాలకృష్ణ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఎంతో కష్టపడుతూ పలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి, రేయింబవళ్లూ కష్టపడుతుంటే, ఇటువంటి ఒక్క ఘటనతో ఎంతో చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు. కీలకమైన ఉప ఎన్నికల వేళ, విపక్షాలకు మరో అస్త్రాన్ని ఇచ్చినట్టయిందని, గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విడుదల రోజున ఓ అభిమానిని, ఇటీవల తన 102వ చిత్రం ప్రారంభోత్సవం రోజున తన అసిస్టెంట్ ను బాలయ్య కొట్టిన వీడియోలు చేసిన నష్టం కన్నా, తాజా వీడియో మరింత నష్టాన్ని కలిగించేదని విశ్లేషిస్తున్నారు.

 కాగా, నిన్న సదరు కార్యకర్త అత్యుత్సాహంతో వచ్చి, బాలకృష్ణ కాలు తొక్కడంతోనే, అప్పటికే అలసిపోయిన బాలయ్య, క్షణికావేశంలో అలా చేశారని, ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు అంటున్నారు. ఇక ఎందుకు కొట్టారన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరని, కొట్టాడా? లేదా? అన్నదే ముఖ్యమని, ఈ ఘటనను వైకాపా శ్రేణులు వైరల్ చేస్తున్నాయని వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News