: పాకిస్తానీలకు సుష్మా స్వరాజ్ స్వాతంత్ర్యదినోత్సవ కానుక.. పెండింగ్ వీసాల క్లియరెన్స్!

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్థాన్‌ వాసులకు వరమిచ్చారు. భారత్ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు పాక్ సైన్యం మరణశిక్ష విధించిన అనంతరం పాక్ వాసులకు మెడికల్ వీసాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో పలువురు పాకిస్థానీలు నేరుగా సుష్మా స్వరాజ్ ట్విట్టర్ కు వినతులు పెడుతున్నారు. అలాంటి వాటిని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసేవారు. దీంతో వారికి వెంటనే వీసా రావడం, వారు భారత్ లో వైద్యం తీసుకోవడం జరిగేది.

ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెండింగ్‌ లో ఉన్న పాకిస్థాన్‌ రోగుల మెడికల్‌ వీసాలన్నింటినీ వీలైనంత త్వరగా క్లియర్‌ చేయనున్నామని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు పెండింగ్‌ లో ఉన్న మెడికల్‌ వీసాలన్నింటినీ అనుమతిస్తున్నాం. ఇండియా ఇన్‌ పాకిస్థాన్‌’ అని ట్వీట్ చేశారు. పాక్ నుంచి భారత్ కు వైద్య సాయం నిమిత్తం ప్రతి నెలా సుమారు 500 మంది పాకిస్థానీ పేషెంట్లు వస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో పాక్ లో వైద్యసాయం కోసం చూస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News