: చందు కోసం నిరీక్షణ... పులకించిన తెలుగు నేల!

బోరు బావిలో పడిన రెండేళ్ల చంద్రశేఖర్ క్షేమంగా బయటపడడంతో ఏపీ పులకించిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆడుకుంటున్న అభంశుభం తెలియని చిన్నారి చందును భూమి మింగేసింది. వెంటనే గ్రామస్థులు రంగంలోకి దిగారు. వారికి రెవెన్యూ సిబ్బంది జతకలిశారు. సమాచారం అందుకోగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి రంగ ప్రవేశం చేశారు. వీరంతా కలిసి నిపుణుల సూచనల కోసం ఎదురు చూడకుండా సమాంతరంగా జేసీబీతో గోతిని తియ్యడం ప్రారంభించారు. కాసేపటికి జిల్లా కలెక్టర్, రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి ఆదేశాలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షణక్షణానికి ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి ఇళ్లల్లో టీవీల ముందు అతుక్కుపోయారు. చందు క్షేమంగా రావాలని కాంక్షించారు. ఇంతలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగప్రవేశం చేశాయి. 11 గంటల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం చందు మృత్యువును జయించాడు. అన్ని విభాగాల సిబ్బంది ప్రజలతో కలిసి భూమిని చీల్చి రాత్రి 2:30 గంటలకు బయటకు తీశారు. దీంతో తెలుగు రాష్ట్రాలు పులకించిపోయాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరం ప్రజలైతే సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చిందింది. నెమ్మదిగా అది హర్షాతిరేకంగా మారి, కేరింతలు కొట్టింది.

More Telugu News