: ఫేస్ బుక్ సాయంతో పది మంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడి అడ్డంగా బుక్కయ్యాడు!

అమ్మాయిల ఫేస్ తెలియకపోయినా, వారిని బుక్ చేయడంలో సిద్ధహస్తుడు. ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా పది మందిని నిలువునా ముంచాడు. సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో పలు పేర్లతో ఖాతాలు ప్రారంభించి, అమ్మాయిలకు వలపు వల వేసి, వారిని మోసం చేస్తున్న ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. నెల్లూరు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఇనుకుర్తికి చెందిన పెంచల వరప్రసాద్ పాలిటెక్నిక్ చదివాడు. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో సివిల్ ఇంజనీర్ గా పని చేశాడు. ఆదాయం చాలడం లేదన్న కారణంగా అమ్మాయిలకు వల వేసి వారి నుంచి డబ్బు దండుకోవడం ప్రారంభించాడు.

 అమ్మాయిల ప్రొఫైల్ ఐడీలు సేకరించి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ముగ్గులోకి దించేవాడు. ఎవరైనా ఓకే చెబితే, కొన్ని రోజుల తరువాత తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని చెప్పి ప్రేమలోకి దించుతాడు. ఆపై తాను కష్టాల్లో ఉన్నానని చెబుతూ డబ్బు గుంజుతాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని వారిని మోసం చేస్తాడు. ఈ క్రమంలో కడప జిల్లా రాయచోటికి చెందిన యువతి ఫిర్యాదుతో వరప్రసాద్ బాగోతం బయటపడింది. ఆమె డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతా, ఫేస్ బుక్ ఐడీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతని వలలో మొత్తం పది మంది అమ్మాయిలు పడ్డారని పోలీసులు తెలిపారు.

More Telugu News