: జలుబుకి విరుగుడు.. టీ, రెడ్ వైన్, నేరేడు పళ్లు!: తాజా అధ్యయనంలో వెల్లడి

జలుబు అనేది ఎలాంటి వారినైనా చికాకు పెడుతూ బాధిస్తుంటుంది. ఊపిరి తీసుకోవడంలో ఏర్పడే ఇబ్బందితో పాటు, ముక్కు నుంచి కారే నీరు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు కొందర్ని తుమ్ములు కూడా బాధిస్తుంటాయి. ఆస్తమా రోగులను జలుబు మరింత ఇక్కట్ల పాలు చేస్తుంది. అయితే జలుబును అడ్డుకోవడంలో తేనీరు (టీ), రెడ్‌ వైన్‌, నేరేడు పళ్లు చక్కగా పనిచేస్తాయని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఎలుక పిల్లలపై జరిపిన తాజా అధ్యయనంలో వీటిలో లభించే ఓ సమ్మేళనం రోగ నిరోధక శక్తి మెరుగుకు తోడ్పడుతుందని నిర్థారణ అయింది.

తేయాకు, రెడ్‌ వైన్‌, నేరేడు పండ్లలో కనిపించే ఫ్లేవనాయిడ్లపై దృష్టి కేంద్రీకరించిన పరిశోధకులు, ఇవి కడుపులోని బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడంతో వెలువడే పదార్థాలు జలుబు లక్షణాలను తగ్గిస్తాయని గుర్తించారు. కాగా, నేరేడు ఫ్లేవనాయిడ్లకు ఔషధ గుణాలున్నాయని ఎప్పుడో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లేవనాయిడ్లు మనిషి కడుపులోని బ్యాక్టీరియాతో కలిసినప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతోందని గుర్తించినట్టు వారు తెలిపారు. ప్రధానంగా జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్లేవనాయిడ్లు చక్కని ఫలితాలు ఇస్తున్నాయని వారు తెలిపారు. 

More Telugu News