: ఉత్తరకొరియా తెలివితక్కువగా ప్రవర్తిస్తే.. ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. తీవ్రస్థాయిలో హెచ్చరించిన ట్రంప్!

ఉత్తర కొరియా కనుక తెలివి తక్కువగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్పేందుకు అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని, ఆ దేశంపై మిలటరీ చర్యకు రెడీగా ఉన్నామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని, ఇరు దేశాలు అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో ఘర్షణ వాతావరణానికి చెక్ పెట్టాలని హితవు పలికారు.

‘మిలటరీ మొత్తం ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంది. నార్త్ కొరియా కనుక తెలివితక్కువగా వ్యవహరిస్తే రంగంలోకి దిగక తప్పదు. కిమ్ జాంగ్ మరో దారి చూసుకోకా తప్పదు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా సమీపంలోని గువామ్ ద్వీపంపై అణ్వాయుధ దాడికి దిగుతామన్న కిమ్ హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు.

కిమ్ కనుక గువామ్‌పై దాడికి దిగితే నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ‘‘కిమ్ గువామ్‌ను కానీ, అమెరికాను కానీ, జపాన్‌ను కానీ, దక్షిణ కొరియాను కానీ భయపెట్టలేరు. ఇది నిజం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయన్న ట్రంప్ ట్వీట్ తర్వాత యూఎఎస్ పసిఫిక్ కమాండ్ రీట్వీట్ చేస్తూ గువామ్‌లో అమెరికాకు చెందిన యూఎస్ఏఎఫ్ బీ-1బీ లాన్సర్ బాంబర్లు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది.

More Telugu News