: ఉత్తర కొరియా తొలి బాంబు వేస్తే కల్పించుకోబోము... అదే అమెరికా అయితే అడ్డుకుంటాం: చైనా

అమెరికాపై ఉత్తర కొరియా తొలి దాడి చేస్తే, తాము కల్పించుకోరాదని, అదే అమెరికా, దక్షిణ కొరియా కలిసి నార్త్ కొరియాపై దాడికి దిగితే అడ్డుకోవాలని చైనా భావిస్తోంది. ఈ విషయాన్ని అధికార దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' శుక్రవారం నాటి సంచికలో ప్రధానంగా ప్రచురించింది. అమెరికాపై ఉత్తర కొరియా అణు క్షిపణులు వేస్తే, చైనా మధ్యస్తంగానే ఉండాల్సిన అవసరం ఉందని పత్రిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పై కటువు వ్యాఖ్యలు చేసిన వేళ, చైనా ఈ తరహా కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

కాగా, నార్త్ కొరియాకు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా, నమ్మకమైన మిత్రుడిగా చైనా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని అదుపులో పెట్టేందుకు చైనా సహకరించాలని స్వయంగా ట్రంప్ కూడా కోరారు. అయితే, కిమ్ ను తాము అదుపు చేయలేమని, ఇదే సమయంలో పూర్తిగా స్నేహబంధాన్నీ తెంచుకోలేమని చైనా స్పష్టం చేసింది. ఇక ఉత్తర కొరియా వద్ద ఉన్న ఆధునిక ఆయుధాల్లో కొన్నింటిని చైనా స్వయంగా విక్రయించింది కూడా. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తామెటూ కల్పించుకోరాదని చైనా భావిస్తోంది. ఒకవేళ అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఉత్తర కొరియాను పూర్తిగా ధ్వంసం చేయాలని భావిస్తే మాత్రం చైనా దాన్ని అడ్డుకుంటుందని 'గ్లోబల్ టైమ్స్' వ్యాఖ్యానించింది.

More Telugu News