: ఆ హీరో రక్త నమూనాల కోసం కోర్టును ఆశ్రయించనున్న ఎక్సైజ్ సిట్!.. రవితేజా? నవదీపా?

టాలీవుడ్ ను కుదిపేసిన మాదకద్రవ్యాల వ్యవహారంలో రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ ప్రముఖ హీరో నుంచి కోర్టు అనుమతితో రక్తం, గోళ్లు, వెంట్రుకలు తీసుకోవాలని ఎక్సైజ్ సిట్ అధికారులు భావిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సిట్ విచారించిన 12 మందిలో ఇద్దరిపై ఎన్డీపీఎస్ (మాదక ద్రవ్యాల నిరోధక చట్టం) కింద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు రక్త నమూనాలు ఇవ్వగా, మరొకరు మాత్రం నిరాకరించారు. నెల రోజులకు పైగా సాగిన విచారణ ప్రక్రియలో భాగంగా పలువురి నోటి వెంట ఈ ఇద్దరి పేర్లు మాత్రమే వచ్చినట్టు సిట్ అధికారులు వెల్లడించారు.

డ్రగ్స్ వాడటంతో పాటు, వీరు ఇతరులకూ అందించారని, ఈ విషయంలో గట్టి సాక్ష్యాలు ఉన్నందున అరెస్టులు తప్పవని అంటున్నారు. మొత్తం 60 గంటల పాటు సినీ ప్రముఖులను విచారించిన వీడియోల నుంచి ఎవరు ఏం చెప్పారన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చార్జ్ షీట్ లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, సిట్ విచారణకు తొలి రోజు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్ రక్త నమూనాలను ఇవ్వగా, హీరో రవితేజ, నటుడు నవదీప్, హీరోయిన్ చార్మీ రక్తం ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ముమైత్ ఖాన్, నందు, శ్రీనివాసరావు తదితరులు రక్తాన్ని ఇస్తామన్నా సిట్ అధికారులు అక్కర్లేదని చెప్పారు. ఇక సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి, అనుమతి తీసుకుని రక్త నమూనాలు తీసుకోవాలని భావిస్తున్నది రవితేజ నుంచా? లేక నవదీప్ నుంచా? అన్నది తేలాల్సి వుంది.

More Telugu News