: 82 ఏళ్ల యాప్ డెవ‌ల‌ప‌ర్‌... ఐఫోన్ యాప్‌ డెవ‌ల‌ప‌ర్ల‌లో ఎక్కువ వ‌య‌సు ఈమెదే!

జ‌పాన్‌కు చెందిన 82 ఏళ్ల మ‌సాకో వాక‌మియా ఐఫోన్ యాప్ డెవ‌ల‌ప‌ర్ల‌లో అతిపెద్ద వ‌య‌స్కురాలిగా నిలిచారు. సాధార‌ణంగా సాంకేతిక రంగంలో ఎక్కువ వ‌య‌సున్న డెవ‌ల‌ప‌ర్ల‌కు స్థానం ఉండ‌దు. అందుకే బ్యాంక్ క్ల‌ర్క్‌గా రిటైరైన త‌ర్వాత తానే స్వ‌యంగా కోడింగ్ నేర్చుకుని, త‌న వ‌య‌సు వారికి ఉప‌యోగ‌ప‌డే యాప్‌ల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్ కంప్యూట‌ర్ నుంచి మొద‌లైన ఆమె కోడింగ్ ప్ర‌స్థానం ఇప్పుడు ఆపిల్ ఐఫోన్ స్థాయికి ఎదిగింది.

60 ఏళ్లు పైబ‌డిన వారికి ఉప‌యోగ‌ప‌డే `హీనాద‌న్‌` అనే గేమ్ తానే స్వ‌యంగా రూపొందించింది. ఆ గేమ్‌కు వ‌చ్చిన పాప్యులారిటీ చూసి వ‌రల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌కు ఆమెను ఆపిల్ వారు ఆహ్వానించారు. జ‌పాన్‌లో జ‌రిగే ఓ బొమ్మ‌ల పండుగ ఆద‌ర్శంగా ఆమె `హీనాద‌న్‌` గేమ్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ గేమ్ ఆడ‌టం ద్వారా 60 ఏళ్లు పైబ‌డిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ని, వారి చేతి వేలి కండ‌రాలు దృఢంగా అవుతాయ‌ని ఆమె తెలియ‌జేశారు. జ‌పాన్‌లో 42000 మందికి పైగా వినియోగ‌దారులు ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. త్వ‌ర‌లో ఇంగ్లిషు, చైనీస్‌, ఫ్రెంచ్ భాష‌ల్లో కూడా ఈ గేమ్‌ను రూపొందించ‌డానికి ఆమె ప్ర‌య‌త్నిస్తున్నారు.

More Telugu News