: అర్ధరాత్రి పార్టీలు, బహిరంగ తిరుగుళ్లు... అమరావతి రహదార్లపై విచ్చలవిడితనం!

అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో పంట పొలాలు ఖాళీగా ఉండటంతో, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి రాత్రుళ్లు ఇక్కడకు చేరుతున్న యువత శ్రుతిమించుతోంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో తూగుతూ, బహిరంగ శృంగారానికి పాల్పడుతూ అడిగిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల తాడేపల్లి ప్రాంతానికి కొందరు యువకులు, ఓ యువతిని తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుండగా, చూసిన కానిస్టేబుల్ అడ్డుకోబోగా, సదరు యువతి రేప్ చేయబోయావంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఆ కానిస్టేబుల్ గ్రామంలోకి వెళ్లి స్థానికులను వెంటబెట్టుకుని వచ్చి వారికి బుద్ధి చెప్పి పంపించాల్సి వచ్చింది.

మరో ఘటనలో ఓ అమ్మాయిని తీసుకువచ్చిన నలుగురు యువకులు మెల్లెంపూడి - గుండిమెడ రోడ్డపై గంజాయి తాగుతుండగా, స్థానికుడొకరు వెళ్లిపోవాలని సూచించగా, అమ్మాయిని తొలుత పంపేసిన వారు, ఆపై రైతుపై దాడి చేసి పారిపోయారు. ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తున్న యువతీ, యువకుడిని సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు సిబ్బంది గట్టిగా మందలించి పంపాల్సి వచ్చింది.

ఇక ఇక్కడ జరిగే పార్టీల్లో గొడవలు జరుగుతున్నాయని, బ్యాచ్ లుగా యువత విడిపోయి కొట్టుకుంటున్నారని, వారి వైఖరితో తాము భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళగిరి – కృష్ణాయపాలెం రోడ్డు, ఉండవల్లి – అమరావతి, కరకట్ట నుంచి రాయపూడి వరకు రాత్రి పూట ఆడా, మగా తేడా లేకుండా పార్టీలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News