: హఫీజ్ సయీద్ నేతృత్వంలో 'మిల్లీ ముస్లిం లీగ్' పార్టీ.. ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు!

2008 ముంబై ఉగ్రదాడులకు సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, ముందుగా చెప్పినట్టుగానే రాజకీయాల్లోకి వచ్చాడు. మిల్లీ ముస్లిం లీగ్ పార్టీని ప్రారంభించినట్టు ఆయన తెలిపాడు. కొత్త పార్టీ కమిటీలను ప్రకటించాడు. మిల్లీ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా సైఫుల్లా ఖలీద్ ను నియమించినట్టు వెల్లడించిన ఆయన, నిజమైన ఇస్లామిక్ పార్టీ తమదేనని, ముస్లింల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపాడు.

పాకిస్థాన్ ను పూర్తి ఇస్లాం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, కొత్త పార్టీ అధికార ప్రతినిధిగా జమాత్ ఉద్ దవా కార్యకర్త తాబిష్ ఖయ్యూమ్ ను నియమించామని అన్నాడు. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ కు కొత్త పార్టీని రిజిస్టర్ చేయాలని దరఖాస్తు చేసినట్టు తెలిపాడు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిని సారించామని అన్నాడు. కాగా, హఫీజ్ సయీద్ హౌస్ అరెస్టులో ఉండటంతోనే భారీ బహిరంగ సభ ద్వారా పార్టీని ఆవిష్కరించాలన్న ఆలోచనను విరమించుకున్నామని ఖయ్యామ్ వ్యాఖ్యానించాడు. ఇతర సీనియర్ జమాత్ ఉద్ దవా నేతలకు పార్టీలో ప్రమేయం ఉండదని తెలిపాడు.

More Telugu News