: ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నా తనివి తీరని కారణమిదే!

తిరుమలలో సామాన్య భక్తులకు లభించేది లిప్తపాటు దర్శన భాగ్యమే. ఇక వీఐపీలకు నిలబడి స్వామివారిని తదేకంగా కాసేపు చూసే అవకాశం లభిస్తుందని భావించినా, వారికి కూడా తనివి తీరక, స్వామిని మరోసారి దర్శించుకోవాలని క్యూ కడుతుంటారు. దీనికి కారణం ఏంటి? ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, మరోసారి వెళ్లాలని అనుకోని భక్తులుండరు. అసలు తిరుమలలో కాలు పెడితేనే, ఓ అనిర్వచనీయమైన శక్తి నడిపిస్తుంది. దేవాలయం మహాద్వారాన్ని దాటగానే, ఆ శక్తి మనసులోకి ప్రవేశించి, స్వామిని చేరుస్తుంది. చూసిన క్షణకాల దర్శనం భక్తులను పరవశులను చేస్తుంది. పునర్దర్శనాన్ని కోరేలా చేస్తుంది.

ఇక స్వామివారిని ఎంత చూసినా తనివి తీరని కారణంగా ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందిస్తూ, "వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనః, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. స్వామివారు ఇచ్చేటటువంటి వరాలు, జ్ఞానాలు ఇవ్వగలిగిన దేవుడు, కోరికలను తీర్చగల శక్తిమంతమైన దేవుడు భూత భవిష్యత్ వర్తమానాల్లో మరొకరు లేరు. సాలగ్రామ రూపంలో కొలువైన స్వామిని చూసేందుకు రెండు కనులూ చాలవు. మూల విరాట్ సుమారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో ఉంటుంది.

దివ్యమైన ఆభరణాలైన కిరీటం, మకర కుండలాలు, పీతాంబరం ఉత్తరీయం, మహా విష్ణు ప్రత్యేక లక్షణంగా ప్రలంబ యజ్ఞోపవీతం, శ్రీవత్సంలతో పాటు భుజాలకు, చేతులకు, కాళ్లకు ఆభరణాలుంటాయి. కంఠాభరణాలు, ఉదరబంధం మొదలైనవి చాలా చాలా అందంగా అమర్చబడి వుంటాయి. స్వామిని చూసే సమయంలో ముందుగా ఇవే కనిపిస్తాయి. ఆనంద నిలయంలో మానవ మేథస్సుకు అందని శక్తులుంటాయి. తమ యోగశక్తితో ఎంతో మంది దివ్య శక్తిని నిక్షిప్తం చేసిన మహత్తర స్థలమిది. సామాన్యులు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ దివ్యమైన శక్తి వలయంలోకి వచ్చి వెళతారు. ఈ శక్తి వలయాల కారణంగానే మనసులో స్వామి స్వరూపం అలాగే నిలిచిపోదు. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది" అని తెలిపారు.

సుమారు 17 కోట్ల సంవత్సరాలకు పూర్వం స్వామి ఇక్కడ వెలిశాడని, అద్భుతమైన భూత కాలంలోనే దేవదేవుడు ఇక్కడికి వచ్చాడని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. రాక్షస బల్లులు భువిపై సంతరించడానికి పూర్వమే ఇక్కడ భక్తుల సంచారం ఉందని వెల్లడించారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా నిర్మించిన మండపం ధ్వజస్తంభాలపై మొసలి వంటి ఆకారానికి తొండంతో కూడిన శిల్పాలు ఉన్నాయని, వీటిని ప్రతి ఒక్కరూ దర్శనానికి వెళ్లే సమయంలో చూడవచ్చని అన్నారు. వాటిపై సవారీ చేస్తున్న మానవులు, వాటి తొండాల చివర కుక్కపిల్లల్లా కనిపించే ఏనుగులను మనం చూడవచ్చని తెలిపారు. అంటే ఆ కాలంలో మనకు డైనోసార్ల వర్ణనతో సరిపోల్చుకోవచ్చని, అప్పట్లో మానవులు ఆ పరిమాణంలో ఉండేవారని మనం అర్థం చేసుకోవచ్చని, పాశ్చాత్యులకు ఆ విషయం తెలియదని అన్నారు. ఆ రాక్షస ఆకారాలు, వాటి గురించి 15వ శతాబ్దంలోని శిల్ప కళాకారులకు ఎలా తెలుసునని ప్రశ్నించిన ఆయన, అదే భరత ఖండం విశిష్టతని అన్నారు.

More Telugu News