: పరుగుల చిరుత బోల్ట్ కు షాక్ ఇచ్చిన గాట్లిన్!

పరుగుల చిరుత, జమైకన్ అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ కు అమెరికన్ స్టార్ స్ప్రింటర్ గాట్లిన్ షాక్ ఇచ్చాడు. లండన్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల రేసు ఫైనల్లో బోల్ట్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ రేసులో బోల్ట్ 9.95 సెకన్లతో తన పరుగును పూర్తి చేశాడు. జస్టిన్ గాట్లిన్ 9.92 సెకన్లతో విజేతగా నిలిచాడు. అమెరికాకు చెందిన మరో స్పింటర్ క్రిస్టియన్ కోలెమన్ 9.94 సెకన్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

8 సార్లు ఛాంపియన్ గా నిలిచిన బోల్ట్ ను 35 ఏళ్ల గాట్లిన్ అధిగమించడం విశేషం. మరోవైపు, ఈ ఛాంపియన్ షిప్ తర్వాత బోల్ట్ రిటైర్ కానుండటంతో, అతని చివరి పోటీని చూసేందుకు అభిమానులు స్టేడియంకు భారీ ఎత్తున తరలి వచ్చారు. దాంతో స్టేడియం కిటకిటలాడింది. పోటీ అనంతరం గాట్లిన్ ను బోల్ట్ అభినందించాడు. గాట్లిన్ గొప్ప పోటీదారుడని, తనకు అసలైన పోటీ నిచ్చింది గాట్లినే అని కొనియాడాడు. మరోవైపు, బోల్ట్ కు తల వంచి గౌరవాన్ని ప్రకటించాడు గాట్లిన్.    

More Telugu News