: హార్వార్డ్‌ విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో భారతీయులపై వివక్ష... దర్యాప్తుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధం?

అమెరికాలోని హార్వార్డ్‌ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలపై దర్యాప్తు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. భారతీయ, ఆసియా సంతతికి చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించటంలో ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన హార్వార్డ్ యూనివర్సిటీ జాతివివక్ష చూపుతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. స్కాలస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ), గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ (జీపీఏ)ల్లో అత్యధిక మార్కులు సంపాదించినా, ఇతర కార్యక్రమాల్లో బహుమతులు పొందినా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, ఐవీ లీగ్‌ కాలేజీ వంటి సంస్థలు తమకు ప్రవేశాలు కల్పించలేదని, అదే సమయంలో తమకంటే తక్కువ స్థాయిలో ప్రతిభ చూపిన ఇతర జాతుల వారికి ప్రవేశాలు ఇచ్చాయని భారత సంతతి అమెరికన్లు, ఆసియా-అమెరికన్లకు చెందిన 64 సంస్థలు 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఫిర్యాదు చేశాయి.

అయితే ఈ ఫిర్యాదులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయశాఖ అధికార ప్రతినిధి సారా ఇస్గర్‌ ఫ్లోరెస్‌ ప్రకటించారు. కాగా, అప్పట్లో దీనిపై అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం ఇవ్వాలన్న కారణంతో కొన్ని విద్యా సంస్థలు కేవలం ప్రతిభనే కాకుండా, ఇతర కోణాల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయని వాదనలు వినిపించాయి.  

More Telugu News