: ఇమ్రాన్‌ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మహిళా చట్టసభ్యురాలిపై లైంగిక ఆరోపణల కేసులో విచారణకు ఆదేశించిన కొత్త ప్రధాని!

లైంగిక ఆరోపణల కేసులో పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహిళా చట్టసభ్యురాలిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై కొత్త ప్రధాని అబ్బాసీ విచారణకు ఆదేశించారు. ఇమ్రాన్‌ఖాన్ తనకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నారని, తాను పార్టీని విడిచి వెళ్లిపోతున్నానని అయేషా గులాలై పేర్కొన్నారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఇమ్రాన్ ఖండించారు. నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేయడానికి తాను కారణమనే ఉద్దేశంతో ఇటువంటి ప్రతీకార చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.

ఇమ్రాన్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ప్యానెల్ ద్వారా విచారణ జరిపించాలని భావిస్తున్నట్టు ప్రధాని అబ్బాసీ జాతీయ అసెంబ్లీలో పేర్కొన్నారు. కాగా, మంగళవారం జాతీయ అసెంబ్లీ వద్ద గులాలై మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇమ్రాన్‌కు మహిళలంటే గౌరవం లేదని, తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపారని ఆరోపించారు.

షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే గులాలై ఆరోపణలను ఇమ్రాన్ ఖండించారు. తనను ఇరుకున పెట్టేందుకు నవాజ్ షరీఫ్ పార్టీ ఆమెను పావులా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. తాను చాలామంది మహిళలతో కలిసి పనిచేశానని, ఇప్పటి వరకు ఎంతమంది అటువంటి ఆరోపణలు చేశారని ఆయన ప్రశ్నించారు.

More Telugu News