: ఢిల్లీలో ఉన్న వ్యక్తి పేరిట ర‌ష్యాలో క్యాబ్ బుక్‌... హ్యాకైన ఊబ‌ర్ యాప్‌!

క్యాబ్ స‌ర్వీసింగ్ యాప్ ఊబ‌ర్ హ్యాక్‌కు గుర‌వ‌డం వ‌ల్ల త‌న‌కు తెలియ‌కుండా ర‌ష్యాలో క్యాబ్ బుక్ అయింద‌ని ఢిల్లీకి చెందిన వ్య‌క్తి తెలిపాడు. ఈ విష‌యాన్ని తాను వెంట‌నే గుర్తించి ఊబ‌ర్ వారికి ఫిర్యాదు చేయడం వ‌ల్ల ఎలాంటి ఆర్థిక న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న చెప్పాడు. మీర్ ర‌ఫె ఓ టీవీ ఛాన‌ల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన‌పుడు ఊబ‌ర్ నుంచి ఒక నోటిఫికేష‌న్ వ‌చ్చింద‌ని, దాన్ని ఓపెన్ చేసిన‌పుడు త‌న అకౌంట్ ద్వారా ర‌ష్యాలో క్యాబ్ బుక్ అయిన‌ట్లుగా తెలిసింద‌ని చెప్పాడు.

తాను వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై క్యాబ్ బుకింగ్ ర‌ద్దు చేసిన‌ట్టు మీర్ వివ‌రించాడు. త‌ర్వాత యాప్‌లో భ‌ద్ర‌ప‌రిచిన త‌న‌ క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను కూడా డిలీట్ చేసిన‌ట్లు తెలియ‌జేశాడు. ఈ విష‌యం గురించి తాను వెంట‌నే ఊబ‌ర్ వారికి ఫిర్యాదు చేశాన‌ని, వారు త‌న అకౌంట్‌ను రీసెట్ చేశార‌ని మీర్ వివ‌రించాడు. దీనిపై ఊబ‌ర్ వారు స్పందిస్తూ ఏదైనా చిన్న సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల ఇలా జ‌రిగి ఉంటుంద‌ని, కేవ‌లం క్యాబ్ బుక్ చేయ‌డం వ‌ల్ల క్రెడిట్ కార్డు వివ‌రాలు చోరీ అయ్యే స‌మ‌స్య రాద‌ని చెప్పారు. అంతేకాకుండా తాము ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేకంగా `రిస్క్ బేస్డ్ ఆథంటికేష‌న్‌` ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తామ‌ని ఊబ‌ర్ ప్ర‌తినిధి వివ‌రించాడు.

More Telugu News