: ప్రభుత్వాన్ని నమ్మకుండా చైనా మాటలను విశ్వసిస్తారా? భలే పార్టీ లెండి మీది!: రాహుల్‌పై సుష్మా పైర్!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చైనా రాయబారి లువో ఝావోహుల్‌ను కలవడంపై విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డోక్లాంలో పరిస్థితిపై ప్రభుత్వం వివరించినప్పటికీ రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలవడం చాలా దురదృష్టకరమన్నారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత అయి ఉండీ ప్రభుత్వం చెప్పిన దానిని విశ్వసించకుండా చైనా వైపు నుంచి నిజాలు తెలుసుకోవాలని ఎలా భావిస్తారని నిలదీశారు.

1962లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు బీజేపీ సీనియర్ నేత ఏబీ వాజ్‌పేయి లేఖ రాస్తూ, ఇండియా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన సుష్మ అప్పటిలానే ఇప్పుడు ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.

అలాగే శ్రీలంకలోని హంబన్‌టోట, కొలంబో, పాకిస్థాన్‌లోని గ్వాడార్ పోర్టుల్లో చైనా పాగే వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలను కూడా సుష్మ తిప్పి కొట్టారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చైనా ఈ పోర్టుల నిర్మాణం ప్రారంభించిందని ఆరోపించారు. హంబన్‌టోట పోర్టు 2008-11లో పూర్తవగా కొలంబో పోర్టు 2011-14 మధ్య పూర్తైందని, గ్వాడార్ కాంట్రాక్ట్‌ను 2013లో కుదుర్చుకుందని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టవద్దని కాంగ్రెస్‌కు సుష్మా స్వరాజ్ హితవు పలికారు.

More Telugu News