: ఇదీ.. బాబు గారి నైజం!: వైఎస్ జగన్ విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శల వర్షం కురిపించారు. నంద్యాలలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, ‘మామకు వెన్నుపోటు పొడవడం.. కాపు కులస్థులకు వెన్నుపోటు పొడవడం. . నంద్యాల ఉపఎన్నిక సమయానికి పవన్ కల్యాణ్ ని పిలవడం..ఎప్పటికప్పుడు డ్రామాలు ఆడటం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం..మైనార్టీలను వంచించడం.. ఇదీ! బాబు గారి నైజం!’అంటూ  జగన్ మండిపడ్డారు.

ఒక్క అబద్ధం కూడా ఆడకపోతే సత్యహరిశ్చంద్రుడు అని, ఒక్క నిజం కూడా చెప్పకపోతే చంద్రబాబు అని అంటారని, చంద్రబాబును ముఖ్యమంత్రి అంటామా? ముఖ్యకంత్రీ అంటామా? అంటూ మండిపడ్డారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే వాడిని బూచాడు అంటామని, మరీ, 21 మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోయిన చంద్రబాబు సీఎమ్మా? దొంగా? అంటూ ఘాటుగా విమర్శించారు. గతంలో కర్నూల్ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు, ఇప్పుడు నంద్యాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఎవ్వరూ భావించరని అన్నారు. నంద్యాల ఎన్నికల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను చూసినప్పుడు, ఇటువంటి వ్యక్తిని నడిరోడ్డుపై పెట్టి కాల్చినా కూడా తప్పులేదని అనిపిస్తోందంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనతో చంద్రబాబు పాలనను పోల్చలేమని అన్నారు. చంద్రబాబు పాలన దిక్కుమాలిన పాలన అని, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ప్రజాపాలన అని అన్నారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకువస్తారని, చంద్రబాబు కేబినెట్ లో ఒక్క ముస్లిం మైనార్టీ వ్యక్తి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. చివరకు, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కేబినెట్ లో కూడా ఓ ముస్లిం వ్యక్తి ఉన్నారని జగన్ ప్రస్తావించారు. 

More Telugu News