: గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో `నోటా` వుంటుంది: సుప్రీం తీర్పు

గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో `పైవారు ఎవ‌రూ కాదు (నోటా)` ఆప్ష‌న్‌పై స్టే విధించాల‌ని కాంగ్రెస్ వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా ఉప‌యోగించ‌డం వ‌ల్ల 1951 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం, 1961 ఎన్నిక‌ల చ‌ట్టానికి విరుద్ధ‌మ‌ని, దీనిపై స్టే విధించాల‌ని కాంగ్రెస్ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ధ‌ర్మాస‌నం కాంగ్రెస్ పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో నోటా అమ‌లుచేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

గుజ‌రాత్‌లోని మూడు స్థానాల‌కు ఆగ‌స్టు 8న ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. పెద్ద‌ల స‌భ‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో ర‌హ‌స్య బ్యాలెట్ ప‌ద్ధ‌తి ఉప‌యోగించ‌రు. ఓటేసిన ఎమ్మెల్యేలు త‌మ బ్యాలెట్ ప‌త్రాన్ని త‌మ పార్టీ పోలింగ్ ఏజెంట్‌కు చూపించిన త‌ర్వాతే బ్యాలెట్‌లో వేయాల్సిఉంటుంది. ఈ విధానానికి తోడు నోటా కూడా అమ‌లు చేయ‌డాన్ని కాంగ్రెస్ వ్య‌తిరేకించింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో మొద‌టి సారి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో నోటా అమ‌లు చేయ‌నున్నారు. గుజ‌రాత్‌లోని 3 స్థానాల‌కు బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతీ ఇరానీ, బ‌ల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌లు పోటీ ప‌డుతుండ‌గా, కాంగ్రెస్ నుంచి సోనియా స‌ల‌హాదారు అహ్మ‌ద్ ప‌టేల్ బ‌రిలోకి దిగుతున్నారు.

More Telugu News