: కర్ణాటక మంత్రి శివకుమార్ కు బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్ చేసే అవకాశం!

కర్ణాటక రాష్ట్ర మంత్రి శివకుమార్ ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు, మైసూరు సహా 39 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మంత్రి సంబంధీకులు, ఆయన పిల్లలు, అత్తమామల ఇళ్లను కూడా ఐటీ అధికారులు వదల్లేదు. ఢిల్లీలోని సర్దార్ జంగ్ ప్రాంతంలోని ఆయన నివాసంలో సైతం సోదాలు జరుగుతున్నాయి. నిన్న శివకుమార్ నివాసాల్లో జరిగిన సోదాల్లో రూ. 11 కోట్ల నగదుతో పాటు, అక్రమ ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అధికారుల ప్రశ్నలకు శివకుమార్ సరైన సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. అన్ని ప్రశ్నలకు 'నాకు తెలియదు, మా చార్టెడ్ అకౌంటెంట్ చెబుతారు, మా లాయర్ చెబుతారు' అంటూ సమాధానాలను దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు బెంగళూరులోని సదాశివనగర్ లో ఉన్న ఆయన నివాసంలోకి మూడు ఫొటో స్టామ్ మిషన్లు, మూడు స్కానింగ్ మిషన్లను అధికారులు తీసుకెళ్లారు. వీటి ద్వారా వివిధ స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, కీలక పత్రాలను జిరాక్స్ తీస్తున్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. దీనికితోడు, నిన్న రాత్రి ఆయనకు వరుసకు సోదరి అయ్యే పద్మ ఇంట్లో ఐటీ అధికారులు రూ. 10 కోట్ల నగదు, రూ. 10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News